బుమ్రాపై గప్టిల్‌ ప్రశంసలు

ఆక్లాండ్‌: భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఈడెన్‌ పార్క్‌ ట్రాక్‌ స్లోగా స్పందించిన కారణంగానే తాము బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయామని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్‌ పేర్కొన్నాడు. భారత్‌కు దాసోహం కావడానికి పిచ్‌ ప్రధాన కారణమన్నాడు. ఇక భారత సమిష్ట ప్రదర్శనపై గప్టిల్‌ ప్రశంసలు కురిపించాడు. భారత్‌ ఆల్‌రౌండ్‌తో అదరగొట్టి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిందన్నాడు.  టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై గప్టిల్‌ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా బౌలింగ్‌ అద్భుతమని, అతని బౌలింగ్‌లో ఎదురుదాడికి దిగడం చాలా కష్టమన్నాడు. మ్యాచ్‌ తర్వాత గప్టిల్‌ మాట్లాడుతూ.. ‘పిచ్‌ చాలా మందకొడిగా మారిపోయింది. పిచ్‌ కారణంగానే మేము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. పిచ్‌ మరీ నెమ్మదించడంతో బ్యాటింగ్‌ చేయడం కష్టం అయ్యింది. మా టాప్‌-4 ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ పిచ్‌ సహకరించని కారణంగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం.